Viral Video: సన్యాసులుగా మారబోతున్న జంట.. రూ. 200 కోట్లు సహా సర్వస్వం పంచేశారిలా.. వీడియో ఇదిగో!

  • గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌లో ఘటన 
  • జైన సన్యాసులుగా మారబోతున్న మిలియనీర్ జంట
  • రెండేళ్ల క్రితం కుమర్తె, ఏడాది క్రితం కొడుకు కూడా అదే మార్గంలోకి
  • వారి ప్రేరణతో ఇప్పుడు వీరు కూడా
  • 22న కుటుంబ సభ్యులతో బంధాలు తెంచుకోనున్న దంపతులు
Gujarat Couple Worth Rs 200 Crore Shower Money From Chariot Here Is Viral Video

భౌతిక సుఖాలు వదిలి సన్యాస జీవితాన్ని గడపాలనుకున్న ఓ మిలియనీర్ జంట తమకున్న యావదాస్తిని ప్రజలకు పంచిపెట్టేశారు. రెండేళ్ల క్రితం వారి కుమార్తె, గతేడాది వారి కుమారుడు కూడా భౌతిక సుఖాలు త్యజించి సన్యాస జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే బాటలో వీరు అడుగు వేశారు. తాము సంపాదించిన రూ. 200 కోట్లను ప్రజలకు పంచిపెట్టేశారు. 

గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌కు చెందిన నిర్మాణరంగ వ్యాపారి భావేశ్ భండారి, ఆయన భార్య ఆధ్యాత్మిక జీవనం (సయ్యమ్ జీవన్) గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం బంధాలు తెంచుకుని, ఆస్తులను వదులుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దుస్తుల నుంచి డబ్బుల వరకు  
రథంలా అలంకరించిన పెద్ద ట్రక్‌పై భావేశ్ దంపతులు వధూవరుల్లా అలంకరిచుకుని నిల్చున్నారు. ముందు బ్యాండ్ మేళంతో, డ్యాన్సులతో రథం సాగుతుండగా పైనున్న దంపతులు ప్రజల్లోకి దుస్తులు, కరెన్సీ నోట్లు విసిరారు. దాదాపు నాలుగు కిలోమీటర్లపాటు ఈ యాత్ర సాగింది. దుస్తులు, డబ్బులే కాదు, తమ మొబైల్ ఫోన్లు, ఏసీలను కూడా దానం చేశారు. 

మిగిలేవి ధవళ వస్త్రం, భిక్ష పాత్ర
ఫిబ్రవరిలోనే తమ వస్తువులను విరాళం ఇచ్చేసిన భావేశ్ దంపతులు ఈ నెల 22న కుటుంబ సభ్యులతో బంధాలను తెంచుకుని సన్యాస జీవితంలోకి మారుతారు. ఆ తర్వాత కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దేశమంతా పర్యటిస్తారు. వారి వద్ద ఇకపై మిగిలేవి ధవళ వస్త్రం, భిక్షా పాత్ర, చీపురు మాత్రమే. 

అత్యంత బాధాకరమైన ‘క్లేశోచన్’
ముగింపు వేడుకలో ఈ దీక్షార్థులు (భావేశ్ దంపతులు) తమ జుట్టు కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏడాదికి రెండుసార్లు తమ తల వెంట్రుకలను ఒక్కొక్కటిగా లాగి తొలగించుకోవాల్సి ఉంటుంది. దీనిని ‘క్లేశోచన్’గా పిలుస్తారు. జైన సన్యాసులు తమ శారీరక నొప్పిని జయించడాన్ని ఇది సూచిస్తుంది. 

కుమార్తె, కొడుకు కూడా
భావేశ్ దంపతుల 19 ఏళ్ల కుమార్తె 2022లో, 16 ఏళ్ల కుమారుడు 2023లో సన్యాసాన్ని స్వీకరించారు. కాగా, మల్టీ మిలియనీర్ అయిన ఓ వజ్రాల వ్యాపారి, ఆయన భార్య కూడా కూడా జైన సన్యాసులుగా మారారు. అంతకు ఐదేళ్ల ముందు వారి కుమారుడు అదే మార్గాన్ని ఎంచుకున్నారు.

More Telugu News